గోషామహల్ :
*‘‘గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించడం సరికాదు..*
ప్రస్తుతం నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నా.. గోవులను రక్షించే బాధ్యత నాదే, ఒకవేళ దమ్ము, ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయండి.. నన్ను అడ్డుకోండి, నన్ను జైల్లో వేస్తారా.. వేయండి.’’ అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పోలీసులకు సవాల్ విసిరారు. గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు హిందూ కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై లేదా.. అని ప్రశ్నించారు. గోవులు, దూడలను అక్రమంగా వధించేందుకు వాహనాల్లో తీసుకెళ్తుంటే అడ్డుకోలేకపోతున్న పోలీసులు, అదే పని గోరక్షకులు చేస్తుంటే వారికి రక్షణ కల్పించాల్సింది పోయి.. వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు. కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగొద్దు అనుకుంటే గోరక్షకులకు రక్షణ కల్పించాలన్నారు. వాటిని కబేళాలకు తరలిస్తున్న వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.