ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్య తేజ వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులను ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక 26 వ డివిజన్ చంద్రమౌళి నగర్, వేదయపాలెం రైల్వే స్టేషన్ రోడ్డు, మోర్ సూపర్ మార్కెట్ రోడ్డు, త్యాగరాజ నగర్, పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల యజమానుల వివరాలను సంబంధిత సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం నుంచి సేకరించాలని, స్థలాల యజమానుల ద్వారానే జంగల్ క్లియరెన్స్ చేయించి వేకంట్ ల్యాండ్ టాక్స్ వసూలు చేయాలని ఆదేశించారు.
నగర పరిధిలో ఉన్న రైల్వే ట్రాక్ కు అనుసంధానంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైల్వే శాఖ అధికారులతో చర్చించాలని అధికారులకు సూచించారు.
డివిజన్ వ్యాప్తంగా గతం నుంచి ఫ్లోర్ పాయింట్లుగా వాడుతున్న ప్రదేశాలను గుర్తించి నగరపాలక సంస్థ హెచ్చరిక బోర్డులను ఆయా ప్రాంతాల్లో పెట్టాలని ఆదేశించారు.
అన్ని డ్రైనేజీ కాలువలలో పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులు నిరంతరం జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
వీధి దీపాల సమస్య లేకుండా ప్రతి విద్యుత్ స్తంభానికి లైట్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ఎక్కువ వెలుగులు ఇచ్చే హై మాక్స్ లైట్లు అమర్చాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.