కొండ బిట్రగుంట సమీపంలో జాతీయ రహదారిపై అండర్ పాస్ ఏర్పాటు చేయండి

– చిన్న తిరుమలగా కొండ బిట్రగుంట ఆలయం ప్రసిద్ధి చెందింది
– ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య అధికం
– ఈ ముంగమూరు తోటలు ప్రాంతంలో నిత్యం రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి
– కొండ బిట్రగుంటకు వెళ్ళే ముంగమూరు తోటలు ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించండి
– భక్తుల రక్షణకు సరైన భద్రతా చర్యలు చేపట్టండి
– కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వినతి

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట ఆలయానికి వస్తున్న భక్తుల రక్షణార్థం జాతీయ రహదారిపై కొండ బిట్రగుంట సమీపంలోని ముంగమూరు తోటలు సెంటర్ వద్ద వెహికల్ పాస్ ఏర్పాటు చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేంద్ర జాతీయ రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి విన్నవించారు. అలాగే ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఆయన ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.

బోగోలు మండలంలో జాతీయ రహదారి-16 నుండి 5 కి.మీ దూరంలో, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అనే ప్రసిద్ధ ఆలయం ఉందన్నారు. ఈ ఆలయానికి తమిళనాడు రాష్ట్రం, నెల్లూరు, అల్లూరు, కావలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారని, దాంతో ఇది మరో తిరుమల గా ప్రసిద్ధి చెందిందన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ సుమారు 20,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారనీ తెలిపారు. భక్తులు ఆలయానికి వెళ్లడానికి NH-16 నుండి కొండ బిట్రగుంట బ్రాంచ్ రోడ్డుకు మళ్ళించారని, ఈ జంక్షన్‌ను ముంగమూరు తోటలు సెంటర్ గా పిలుస్తారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ముంగమూరు తోటల సెంటర్ వద్ద ఉన్న జంక్షన్ ప్రధాన ట్రాఫిక్ పాయింట్‌గా మారిందని, దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ జంక్షన్‌లో భారీ ట్రాఫిక్ దృష్ట్యా, కొండ బిట్రగుంట బ్రాచ్ రోడ్డులోకి ప్రవేశించడానికి జాతీయ రహదారికి అవతలి వైపు దాటేటప్పుడు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, కొన్ని సంవత్సరాల్లో దాదాపు 500 కి పైగా ప్రమాదాలు జరిగాయనీ, పేర్కొన్నారు. దాంతో ప్రజలు/భక్తులు ప్రాణాలు కోల్పోయారని, చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయని అన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని బోగోలు మండలం, NH-16లోని ముంగమూరు తోటల సెంటర్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ (OR) వెహికల్ అండర్ పాస్ (VUP) నిర్మాణానికి ఆమోదం తెలియజేయాలని అభ్యర్థించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed