కూరగాయల మార్కెట్ రోడ్డు ఆక్రమణలను తొలగించండి

– కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మద్రాస్ బస్టాండ్ ఎ.సి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ ప్రాంగణం పరిసరాలలో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తూ, నిరంతరం ట్రాఫిక్ అంతరాయాలకు కారణంగా నిలుస్తున్న రోడ్డు మార్జిన్ దుకాణాలను తొలగించి, తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షించాలని కమిషనర్ వై.ఓ నందన్ శానిటేషన్ఈ విభాగం అధికారులను ఆదేశించారు.

పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఏసి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంగణాలను కమిషనర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పేరుకుపోయిన కూరగాయల వ్యర్ధాలు, అత్యంత అపరిశుభ్రంగా ఉన్న మార్కెట్ పరిసర ప్రాంతాలు, జనావాసాల మధ్యనే తిరుగుతూ, రోడ్లపై విశృంఖలంగా సంచరిస్తున్న పశువులను గుర్తించిన కమిషనర్ సంబంధిత ప్రాంతపు శానిటేషన్ విభాగం ముగ్గురు సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్.హెచ్.ఓ ను ఆదేశించారు.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేస్తున్న దుకాణదారులను గుర్తించి ఐదువేల రూపాయలు జరిమానాలను కమిషనర్ విధించారు.

పెద్ద సంఖ్యలో వినియోగదారులు విచ్చేసే కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని నిరంతరం అత్యంత పరిశుభ్రంగా ఉంచి పారిశుధ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని దుకాణాదారులు, మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులను కమిషనర్ సూచించారు.

అనంతరం స్థానిక భగత్ సింగ్ కాలనీలో హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ళపట్టాలు అందజేసేందుకు రూపొందిస్తున్న వేదిక ఏర్పాటు నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి కమిషనర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనూష, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అర్బన్ ఎమ్మార్వో షఫీ మాలిక్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు,అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *