*స్పెషల్ స్టోరీ*

*కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా…!*

*నా అర్జీకి న్యాయం జరిగింది*

*కృతజ్ఞతతో కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధురాలు*

నెల్లూరు, (జన హుషార్) మార్చి 2: ప్రజల అర్జీల పరిష్కారంలో జాప్యం జరుగుతుందనే భావన ఉన్న నేపథ్యంలో, ఒక వృద్ధురాలి కృతజ్ఞతాభావం జిల్లా యంత్రాంగంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది.

“అర్జీ ఇచ్చామా… పని అయిపోయిందా… వెళ్ళిపోయామా” అన్న భావనకు భిన్నంగా, తన సమస్యను పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌కు రావడం విశేషంగా నిలిచింది.

హిమాన్షు శుక్ల నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి గ్రీవెన్స్ డే (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో అందిన మొట్టమొదటి అర్జీ ఇదే కావడం విశేషం. వృద్ధురాలు తన సమస్యను వినిపించగానే, కలెక్టర్ మానవీయ దృక్పథంతో స్పందించి, వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. “ప్రజల సమస్యల పరిష్కారమే ప్రాధాన్యం” అనే సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా చాటిచెప్పారు.

*యుద్ధ ప్రాతిపదికన చర్యలు – శాశ్వత పరిష్కారం*

కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఆలస్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు. సంబంధిత శాఖల సమన్వయంతో సమస్యను పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపించారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న సమస్య ఒక్క అర్జీతో పరిష్కారమవడంతో వృద్ధురాలి ఆనందానికి అవధులు లేకపోయాయి.

*శరీరం సహకరించకపోయినా… కృతజ్ఞత చెప్పాలనే తపన*

వయస్సు పైబడి, ఆరోగ్యం సహకరించకపోయినా… తన సమస్యను పట్టించుకుని తన కుమారుని నుంచి తన ఇంటిని తనకు ఇప్పించిన కలెక్టర్ కు స్వయంగా కృతజ్ఞతలు చెప్పాలని ఆమె నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో అతి కష్టం మీద కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

ఆ సమయంలో జిల్లా అభివృద్ధి పై సీఎం గారితో సమావేశం వున్నందున కలెక్టర్ విజయవాడకు వెళ్లి వున్నందున అందుబాటులో వున్న జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ ను ఆమె కలిశారు. వారికి మిఠాయిలు అందజేసి, మనస్ఫూర్తిగా దీవించారు. ఈ సంఘటన అక్కడి సిబ్బందిని కూడా భావోద్వేగానికి గురిచేసింది.

ఒక సామాన్య వృద్ధురాలి కృతజ్ఞత, జిల్లా యంత్రాంగం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబించింది. ప్రజల అర్జీలపై తక్షణ స్పందన, మానవీయ దృక్పథం ఉంటే పరిపాలన ఎలా ఉండాలో ఈ సంఘటన చూపించింది.

ప్రజల సమస్యల పట్ల చొరవతో ముందుకెళ్తున్న జిల్లా యంత్రాంగానికి ఇది ఒక ప్రేరణాత్మక ఘట్టంగా నిలిచింది.

*సమస్య నేపథ్యం ఇది…*

గత సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన కావలి కి చెందిన రమా జ్యోతి అనే వృద్ధురాలు నడవలేని స్థితిలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కింద కూర్చొని ఉండగా అటుగా వెళుతున్న కలెక్టర్ గమనించి నేరుగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన మొదటి పి జి ఆర్ ఎస్ లో మొట్టమొదటి అర్జీని ఆమె వద్ద నుండి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్వీకరించారు. ఆమె పెద్ద కొడుకు తనను మభ్యపెట్టి తాను నివసిస్తున్న ఇంటిని తన పేరు మీద రాయించుకుని తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని, నిలువ నీడ లేకుండా చేశాడరని వాపోయింది. తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు పిలిచి ఆమెకు వెంటనే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ ను రద్దుచేసి ఆమె ఇంటిని ఆమెకు గౌరవంగా జిల్లా కలెక్టర్ అప్పగించారు.

*DIPRO, I&PR, NELLORE*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *