కన్నతల్లికి దణ్దం పెట్టనోడు తల్లికి వందనం అడిగితే..! ఎందుకీ ఆతృత ?
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు కావడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పెన్షన్లు మినహా ఇతర పథకాల అమలుకు ప్రభుత్వం సిద్దం కాకపోవడం, తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను వదిలేయడంపై జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే జగన్ ట్వీట్ కు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
తల్లికి వందనం పథకంపై జగన్ చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. కన్న తల్లికి దణ్ణం పెట్టలేని జగన్.. తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టులో 9 వేల మంది నిర్వాసితులకు ఆర్ధిక ఇబ్బందుల్ని లెక్కచేయకుండా వెయ్యి కోట్లు ఇచ్చామని పయ్యావుల జగన్ కు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాధాన్య అంశాలున్నా పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చినట్లు తెలిపారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు నెలల్లో పోలవరం ప్రాజెక్టు కోసం చేసిన దాంట్లో ఐదు శాతమైనా జగన్ తన ఐదేళ్ల పాలనలో చేశారా అని పయ్యావుల ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం కళ్లారా చూశారని, పోలవరం ఏ ఒక్క ప్రాంతానికో వరం కాదని, మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఇదో గొప్ప వరం అని పయ్యావుల జగన్ కు తెలిపారు. అయినా రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే ఆతృత జగన్‌కు అనవసరమని పయ్యావుల తెలిపారు. రాష్ట్రంలో అనర్హులు పేరిట పెన్షన్లను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వైసీపీ నేతలు సృష్టించిందే అని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు