
*ఓపెన్ ఫోరం కార్యక్రమం ద్వారా ప్రజలకు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నారు : కమిషనర్ వై.ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నేతృత్వంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల ద్వారా కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమం ద్వారా ప్రజలకు టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నారు.
అందులో భాగంగా నేడు నిర్వహించిన ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులకు వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అందుకున్న మొత్తం 20 సమస్యలలో 6 సమస్యలకు సత్వర పరిష్కారం అందించారు. 14 సమస్యలకు క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం పరిష్కారాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఓపెన్ ఫోరం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం పొందామని స్థానిక జగదీష్ నగర్ కు చెందిన శ్రీనివాసులు రెడ్డి, నవాబు పేటకు చెందిన వెంకట సురేష్ లు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 2020 సంవత్సరంలో కె.ఎస్.ఆర్ కన్ స్ట్రక్షన్స్ ద్వారా నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం నిర్దేశించిన అనుమతుల మేరకు ఒక అపార్ట్మెంట్ నిర్మించామని తెలిపారు. అయితే నిర్మాణం పూర్తయిన తర్వాత మార్టగేజ్ విడుదలలో తీవ్రమైన జాప్యం జరిగి అపార్ట్మెంట్ వాసులకు సమస్యాత్మకంగా మారిందని వివరించారు.
వెంకట సురేష్ మాట్లాడుతూ నవాబుపేట ప్రాంతంలో 2015 వ సంవత్సరంలో అన్ని అనుమతులతో జి + ఫోర్ నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. నిర్మాణం అనంతరం మార్ట్ గేజ్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు.
నెల్లూరు నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమంలో సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని, వెంటనే మార్ట్ గేజ్ లు విడుదల చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించారని సంతోషం వ్యక్తం చేసి కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు డి.సి.పి రఘునాథరావు, ఏ.సీ.పి వేణు, టి.పి.ఓ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.