*ఓటమి తర్వాత ఈవీఎంలపై నిందలే నిందలు : అమిత్ షా*
లఖ్‌నవూ: కాంగ్రెస్ , సమాజ్‌వాదీ పార్టీ లపై కేంద్రమంత్రి అమిత్ షా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి లేరని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆ రెండు పార్టీలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను నిందించేందుకు ముందుగానే పథకం వేశాయని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న షా.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
ఈ ఎన్నికల్లో భాజపా గెలుపు దిశగా పయనిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్క్‌ను దాటిందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఓటమి అనంతరం ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇద్దరు యువరాజులు (రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌లను ఉద్దేశిస్తూ) మీడియా సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈవీఎంలలో తప్పిదాలు ఉన్నాయని.. వారి ఓటమికి అదే కారణమని మెషీన్లను నిందించడం పక్కా. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. వారి పథకాన్ని అమలుచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటారు’’ అని జోస్యం చెప్పారు.