
*ఏపీలో ఎస్‌హెచ్‌జీలు నిర్వహిస్తున్న మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎన్ని?*
– లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ ఎన్నని, ముఖ్యంగా నెల్లూరులో ఎన్ని ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. రాష్ట్రమంతటా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువుల మార్కెట్ లింకేజీలపై ప్రభుత్వం ఏవైనా అంచనాలు నిర్వహించిందా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP), సాంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ నిధి పథకం(SFURTI) వంటి పథకాల కింద స్వయం సహాయక సంఘాల నేతృత్వంలోని సంస్థలకు మద్దతుగా కేటాయించిన నిధుల వివరాలు కోరారు. అలాగే రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు అందుతున్న డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత శిక్షణ, అందుకోసం కేటాయించిన నిధుల వివరాలు ఆరా తీశారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి ప్రశ్నలకు కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే గారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల రిజిస్ట్రేషన్ కోసం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ను 01.07.2020న ప్రారంభించామని, అప్పటి నుంచి నవంబర్ 30, 2025 నాటికి ఉద్యమ్ పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ లో SHG ల తరఫున 1,30,171 మైక్రో ఎంటర్ప్రైజెస్ నమోదు అయ్యాయని తెలిపారు. ఇక నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్ప్రైజెస్ నమోదు అయ్యాయన్నారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(SERP) దీనదయాళ్.. అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద విస్తృతమైన క్షేత్ర అధ్యయనాలను నిర్వహించిందని చెప్పారు. దీని ద్వారా ఇ-కామర్స్, SARAS ప్రదర్శనలు, ఇతర మార్కెటింగ్ మార్గాల ద్వారా అమ్మకాలను ప్రోత్సహించడానికి, విక్రేతలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటివరకు ONDC( ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో రాష్ట్రంలో 12864 మంది విక్రేతలు 31466 ప్రోడక్ట్స్‌కు రిజిస్టర్ చేసుకోగా 7114 మంది ఆన్‌బోర్డ్ అయ్యారని చెప్పారు. ఇక నెల్లూరు జిల్లాలో 541 మంది 1427 ప్రోడక్ట్స్ రిజిస్టర్ చేసుకోగా.. 260 మంది ఆన్‌బోర్డ్ అయినట్లు చెప్పారు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) ద్వారా MSME మంత్రిత్వ శాఖ.. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP)ను అమలు చేస్తోందని, వ్యవసాయేతర రంగంలో కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో, భావి వ్యవస్థాపకులకు సహాయం చేయడం ద్వారా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఈ పథకం అమలవుతోందని చెప్పారు. PMEGP కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టు వ్యయంలో 25% మరియు పట్టణ ప్రాంతాల్లో 15% మార్జిన్ మనీ (MM) సబ్సిడీని అందిస్తున్నారని చెప్పారు. ప్రత్యేక కేటగిరీకి గరిష్ట వ్యయం తయారీ రంగంలో అయితే రూ. 50 లక్షలు, సేవా రంగంలో రూ. 20 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల పథకం (SFRUTI) అనేది చేతివృత్తులవారి ఆదాయాల పెరుగుదల కోసం విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి ఉద్దేశించిన పథకమని చెప్పారు. ఈ పథకంలో SHG సంస్థలకు ప్రత్యేక నిబంధన లేదని పేర్కొన్నారు.
MSME మంత్రిత్వ శాఖ.. తన క్షేత్ర కార్యాలయాల ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల MSME/పరిశ్రమ విభాగాలు, బ్యాంకులు, ఇతర MSME వాటాదారుల సమన్వయంతో వర్క్‌షాప్‌లు, మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనేక అవగాహన ప్రచారాలను నిర్వహిస్తుందని చెప్పారు. దీని ద్వారా మహిళలతో సహా వాటాదారుల భాగస్వామ్యం పెరుగుతుందని, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు, బ్యాంకుల గ్రామీణ శాఖల ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.