*ఎంపీ వేమిరెడ్డి చొరవతో రైల్వే స్టేషన్లలో సమస్యలకు పరిష్కారం*
– ఎంపీ ప్రస్తావించిన రైల్వే సమస్యలపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం.. సమస్యల పరిష్కారం.
– ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని వెల్లడి
నెల్లూరు జిల్లా పరిధిలోని రైల్వేస్టేషన్లలో నెలకొన్న కనీస వసతులపై దక్షిణ మధ్య రైల్వే స్పందించి పరిష్కరించింది. నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే స్టేషన్ల పరిధిలో నెలకొన్న కనీస మౌలిక వసతులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు లేఖ రాశారు. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు రైల్వేస్టేషన్‌లో నీటి సమస్యలు, కావలి రైల్వే స్టేషన్ పరిధిలో చెత్త తరలింపు, వర్షాకాలంలో నీటి లీకేజీలు, ట్యాప్ కనెక్షన్లు, స్టేషన్ పరిధిలో బెంచీల ఏర్పాటు, ప్రయాణికులు కూర్చునేందుకు సరైన వసతులు లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఇక నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న పనుల్లో వేగం పెంచాల్సిన ఆవశ్యకతను లేఖ ద్వారా తెలియజేశారు. అలాగే స్థానికంగా అపరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ వంటి కనీస వసతులపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని లేఖలో పేర్కొన్నారు. దాంతో పాటు మనుబోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలను కూడా ప్రస్తావించారు. ప్రయాణికుల అవసరార్థం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఎంపీ కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రస్తావించిన సమస్యలను పరిశీలించిన జీఎం అరుణ్ కుమార్ జైన్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసి సమస్యలను పరిష్కరించినట్లు ప్రత్యేక లేఖ విడుదల చేశారు. అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు ఎక్కడా అవస్థలు లేకుండా చూస్తామని, సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.