ఉద్యోగులకు ఈహెచ్ఎస్ నిలిపివేత..!!
ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకుంది. బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు, ఉచిత ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానంతో ముందుగా ఈ రెండు రకాల సేవలు నిలిపివేయాలని డిసైడ్ అయింది. ప్రభుత్వంతో చర్చల తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని సంఘం నేతలు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) డిమాండ్ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ.3 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సంఘ నేతలు వివరించారు. గత ప్రభుత్వంలో రూ.2,250 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వంలో రూ.1500 కోట్ల బిల్లులు విడుదల చేసినప్పటికీ ఇంకా, రూ.3 వేల కోట్లు బకాయిలున్నాయని పేర్కొన్నారు. ఆస్పత్రల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఉచిత వైద్య సేవలు అందించలేకపోతున్నామని స్పష్టం చేసారు. బకాయిల వల్ల నెట్‌వర్క్ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాలు, రసాయనాల సరఫరాను వ్యాపారులు నిలిపివేశారని వివరించారు.
ఆస్పత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఓవర్ డ్రాఫ్ట్ అవడంతో బ్యాంక్‌లు కూడా సహకరించడం లేదని చెప్పారు. దీంతో 6వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. బకాయిలు క్లియర్ చేస్తామని ట్రస్ట్ సీఈవో ఫోన్‌లో చెప్పారని, రేపు (సోమవారం) చర్చలకు రావాలని ఆహ్వానం అందిందని తెలిపారు. ప్రభుత్వంపై గౌరవంతో 6వ తేదీ నుంచి ఓపీ, ఈహెచ్‌ఎస్ సేవలు మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదే సమయం లో అటు ప్రభుత్వం ఆరోగ్యబీమా విధానంలోకి వెళ్తే రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల మనుగడ కష్టమని చెప్పుకొచ్చారు. ఆరోగ్య బీమాలో కనీసం కో-పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఆరోగ్య బీమా ద్వారా వంద శాతం క్యాష్‌లెస్ అంటే ఆస్పత్రులు నడవడం కష్టమని వాపోయారు. అంతకు ముందు ఆస్పత్రుల యాజమాన్యాలు సమావేశమై ఆస్పత్రుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాయి. ఈనెల 25వ తేదీ వరకూ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.