ఇఫ్కో సెజ్‌ అభివృద్ధిపై మరోసారి ఎంపీ వేమిరెడ్డి భేటీ

– ఇఫ్కో సీఈవో ఉదయ్‌ శంకర్‌ అవస్థిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి
– ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమల స్థాపనపై చర్చ
– ఇఫ్కో పరిధిలో పరిశ్రమలు తీసుకువచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఈవో
– అలాగే ఎంపీగా మీ పరిధిలో కంపెనీలు తెచ్చేందుకు చొరవ చూపాలని ఎంపీకి సూచన
– అందుకు తప్పకుండా తమ మద్దతు ఉంటుందని వెల్లడి

జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ అభివృద్ధిపై మరోసారి ఇఫ్కో సీఈవో డా.ఉదయ్‌ శంకర్‌ అవస్థితో భేటీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డిని.. ఉదయ్‌ శంకర్‌ అవస్థి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనతో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. కొడవలూరు మండల పరిధిలో ఉన్న ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమలు స్థాపించాలని ఇటీవల ఎంపీ వేమిరెడ్డి.. ఇఫ్కో సీఈవో, ఛైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. అనంతరం మరోమారు సంస్థ సీఈవో డా.ఉదయ్‌ శంకర్‌ అవస్థితో గురువారం ప్రత్యేకంగా భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. 2770 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, పరిశ్రమలు వస్తే జిల్లా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయని ఆయన వివరించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఉదయ్‌ శంకర్‌ అవస్థి.. తమ పరిధిలో పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తామని ఎంపీ వేమిరెడ్డికి హామీ ఇచ్చారు. ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో పరిశ్రమలు ఏర్పాటుకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా డా.ఉదయ్‌ శంకర్‌ అవస్థి.. ఎంపీ వేమిరెడ్డికి కీలక సూచన చేశారు. ఎంపీగా మీ పరిధిలో పారిశ్రామికవేత్తలను కిసాన్‌ సెజ్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి, సెజ్‌లో కంపెనీలు ఏర్పాటు చేసేలా ఆహ్వానించాలని సూచించారు. ఎంపీ చొరవతో ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తే.. తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed