ఆ ప్రాజెక్ట్ కు వెయ్యి కోట్లిచ్చి.. ఏపీ నెత్తిన పాలుపోసిన ప్రధాని మోదీ!
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో శుభవార్త చెప్పింది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్న కేంద్రం వరాల జల్లు కురిపిస్తుంది. ఇప్పటికే పలు రైల్వే మార్గాలను విస్తరిస్తున్న కేంద్రం జాతీయ రహదారుల విస్తరణ విషయంలో కూడా ఏపీకి శుభవార్త చెప్పింది
ఏపీకి కేంద్రం శుభవార్త
ఏపీ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పలు జాతీయ రహదారుల విస్తరణకు ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే క్రమంలో తాజాగా అనకాపల్లి అనంతపురం ఎన్ హెచ్ 16 కారిడార్ ను ఎన్ హెచ్ 516C లో షీలా నగర్ జంక్షన్ ను కలుపుతూ ఆరు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి దాదాపు 1000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఈ సమస్యకు చెక్
మొత్తం 963.93 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు పేర్కొన్న కేంద్రం 12.66కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లేన్ సబ్బవరం గ్రామానికి తూర్పున మొదలై షీలానగర్ జంక్షన్ లోని ప్రస్తుత పోర్టు రోడ్డులో గెయిల్ ఆఫీస్ దగ్గర ముగుస్తుందని పేర్కొంది. ఇక ఈ కారిడార్ తో అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ఉంటాయని అంటున్నారు.
విశాఖ పోర్టుకు పెరగనున్న కనెక్టివిటీ
షీలా నగర్ ఆనందపురం మధ్య ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు.ఇక ఈ ఎన్ హెచ్ కారణంగా విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు. విశాఖపట్నం పోర్టు లాజిస్టికల్ ఎఫిషియన్సీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ కారణంగా విశాఖ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు కూడా చెక్ పడుతుందని అంటున్నారు.
ఏపీలో రోడ్ కనెక్టివిటీపై కేంద్రం ఫోకస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. రహదారి నిర్మాణాలకు సంబంధించి పలుచోట్ల విస్తరణ పనులకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఏపీలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీని పెంచడం ద్వారా రాష్ట్ర పురోగతికి కేంద్రం దోహదం చేసి ఏపీ నెత్తిన పాలు పోస్తోంది.