ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి

– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,

నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, షాపు రూముల బాడుగలు, పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్య తేజ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ పరిపాలనా కార్యదర్శులను ఆదేశించారు.

నెల్లూరు నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం అధికారులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం వారాంతపు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు ప్రతిరోజు మిగిలిన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించి నిర్దేశించిన పలు లక్ష్యాలను సాధించే దిశగా విధులను పంచుకొని పూర్తిస్థాయిలో పూర్తి అగునట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సచివాలయ పరిధిలోని స్థానిక సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నించాలని, అవసరమైన ఎడల ఉన్నతాధికారులకు తెలియచెసి సమస్యను పరిష్కరించే విధముగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు అంతా విధుల నిర్వహణలో అత్యంత క్రమశిక్షణను పాటించాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించేలా కృషి చేయాలని తెలిపారు. పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో ఆస్తి పన్ను, నీటి చార్జీలు వసూళ్ళ కొరకు పర్యటించాలని సూచించారు. పన్నుల వసూళ్ల లక్ష్యాలను సాధించేందుకు వార్డు సచివాలయ అన్ని విభాగాల కార్యదర్శులను సమన్వయం చేసుకుని వ్యవహరించాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయంలోపు చెల్లించని పక్షంలో తాగునీటి కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు బకాయిదారులకు తెలియజేయాలన్నారు.

అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను అందుకోని కార్యదర్శులఫై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొండి బకాయిదారులను గుర్తించి మున్సిపల్ చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే సచివాలయం పరిధిలోని నూతన భవనములు , అదనపు నిర్మాణాలు చేపట్టి పూర్తి అయిన భవనములను కార్యదర్శులు గుర్తించి వాటిని ఆస్తిపన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు , అలాగే రెవిన్యూ ఇనిస్పెక్టర్లులు,అడ్మిన్, ఇన్చార్జి పరిపాలనా కార్యదర్శులుగా వున్న కార్యదర్శులు పన్ను వసూళ్లపై శ్రద్ధ వహించవలసినదిగా ఆదేశించారు.

పన్నుల వసూళ్ల లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు పి. రమ్య – రామ్మూర్తి నగర్, ఎం. సాయి పూజ – ఆదిత్య నగర్, జె.జయలక్ష్మి – బర్మాషల్ గుంట వార్డు సచివాలయ ఇన్చార్జి పరిపాలనా కార్యదర్శులకు షోకాజు నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారి ఇనాయతుల్లా, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు, శరత్,సందీప్,వంశీదర్ రెడ్డి,కార్తీక్ రెడ్డి,శ్రావణ్,వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed