28. 2. 2025. నెల్లూరు.

*ఆప్కాస్ రద్దు చేస్తే, మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా*.

ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆప్కాస్ రద్దు చేసి, ఔట్సోర్సింగ్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కే. పెంచల నరసయ్య మాట్లాడుతూ

ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆప్కాసులో ఉన్న ఔట్సోర్సింగ్ కార్మికులను ఆప్కాసు రద్దు చేసి, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని తీర్మానం చేశారు.

దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో మున్సిపల్ కార్మికులకు కాంట్రాక్టు, దళారీ వ్యవస్థ ఉండడం వలన సక్రమంగా జీతాలు అందేటివి కావు. రెండు, మూడు నెలలకు ఒకసారి ఇచ్చేవారు, ఉద్యోగ భద్రత ఉండేది కాదు. దీని వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది.

గత ప్రభుత్వం మధ్య దళారులు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆప్కాసును ఏర్పాటు చేశారు. దీనివలన మున్సిపల్ కార్మికులకు ఒకటో తారీకున జీతాలు మరియు ఉద్యోగ భద్రత ఉన్నది. దీనిని రద్దు చేస్తే దీని కంటే మెరుగైన వ్యవస్థను తీసుకుని రావాలి, అంతే తప్ప మరలా కాంట్రాక్టర్లకు అప్పజెప్పతామని చెప్పడం దారుణం.

రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇస్తారని, దశల వారీగా మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తారని మున్సిపల్ కార్మికులు ఎంతగానో ఆశించారు.

కానీ మరలా పాత వ్యవస్థని తీసుకొని వస్తామని, ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తామని చెప్పడం అంటే మున్సిపల్ కార్మికులను ఇబ్బందులకు గురి చేయడమే. మున్సిపల్ కార్మికులు మున్సిపాలిటీలను పరిశుభ్రం చేసి, ప్రజల అవసరాలు తీర్చడమే కాకుండా, ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు చేస్తున్నారు.

కాబట్టి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆప్కాస్ రద్దు చేస్తే, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని అన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ, నాయకులు అశోక్, సుజాత, వజ్రమ్మ, భాగ్యమ్మ, కొండమ్మ, శ్రీనివాసులు, బాలు, కొండమ్మ, చెన్నయ్య, మారుతి, సలోమి, దానియేలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed