ఆత్మ విశ్వాసమే మహిళలకు శ్రీరామరక్ష
– ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
– అంబారాన్నంటిన వేడుకలు.. ఆదర్శ మహిళలకు ఘన సన్మానం
– అవమానాలకు కుంగిపోకుండా ఆశావహ దృక్పథంలో ముందుకు సాగాలి
– సీఎం చంద్రబాబు, ఎంపీ వేమిరెడ్డి సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నా
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
ఆత్మ విశ్వాసమే మహిళలకు రక్ష అని, అవమానాలకు కుంగిపోకుండా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఏడాది పొడుగునా ఎన్నో పండగలున్నా మార్చి 8 న విశ్వవ్యాప్తంగా నిర్వహించే మహిళా దినోత్సవమే మహిళల పాలిట నిజమైన పండగన్నారు. శుక్రవారం బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె మాట్లాడారు. వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో కోవూరు నియోజకవర్గంలో వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా ఉన్న పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో, బాణసంచా మోతలతో సభా ప్రాంగణం మార్మోగింది. మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి విచ్చేసిన ఆమెకు భారీ సంఖ్యలో మహిళలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వేదిక వరకు చేరే వరకు పూల వర్షం కురుపించి తమ అభిమానం చాటుకున్నారు. దీప ప్రజ్వలన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ.. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలు, సామాజిక సేవ, సాంస్కృతిక తదితర రంగాలలో విశేష ప్రతిభ చూపిన దాదాపు 20 మహిళలకు సన్మానించి మెమెంటోలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా నిరుత్సాహ పడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యే అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం, ఎంపి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రోత్సాహమే కారణమన్నారు.
ఇంట్లో చెల్లిగా, అక్కగా, అమ్మగా, ఆడపడుచుగా అన్ని రకాల బాధ్యతలను మోసే మహిళలకు ఒక నాయకురాలిగా, సేవకురాలిగా, ప్రధానిగా, రాష్ట్రపతిగా దేశాన్ని నడిపించగలగడం పెద్ద సమస్య కాబోదన్నారు. అవమానాలకు క్రుంగి పోకుండా ఆశావాదంతో అడుగు ముందుకు వేయాలని మహిళలకు హితోపదేశం చేశారు. ఎన్నో అవరోధాలు అధిగమిస్తూ.. తమ కుటుంబాలను పోషించేందుకు, సమాజంలో గౌరవంగా జీవించేందుకు నిత్యం పోరాడే మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంకితం చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్ పర్సన్ నస్రీన్ ఖాన్, బుచ్చి జెడ్ పి టి సి సూరా ప్రదీపా రెడ్డి, కొన్సిలర్లు ప్రత్యూష, పుట్ట లక్ష్మి కాంతమ్మ, తాళ్ల వైష్ణవి నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రతినిధులతో పాటు టిడిపి నాయకులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, మోర్ల మురళి, కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.