*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంతమేర పెరిగింది.? అని లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి వేమిరెడ్డి* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంతమేర పెరిగింది.? అని లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి వేమిరెడ్డి*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదలపై ఎంపీ వేమిరెడ్డి లోక్‌సభలో పలు ప్రశ్నలు వేశారు. డిసెంబర్, 2024లో విడుదలైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ – 2023 ప్రకారం, 2021 నుంచి దేశంలోని అడవులు, చెట్ల విస్తీర్ణం 1445.5 చదరపు కి.మీ మేర పెరిగిందనేది వాస్తవమేనా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా పెరుగుదల వివరాలు కోరారు. దేశంలోని పశ్చిమ, తూర్పు కనుమల్లో అటవీ విస్తీర్ణం తగ్గుముఖం పట్టిందనేది నిజమేనా అని ఆరా తీశారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 2024 డిసెంబర్ 21న విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) 2023 ప్రకారం.. 2021 ISFR రిపోర్టుతో పోలిస్తే దేశంలో అడవులు, చెట్ల విస్తీర్ణంలో 1445.81 చదరపు కిలో.మీటర్లు నికర పెరుగుదల ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 8,27356.95 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 25.17% గా ఉందన్నారు. ISFR-2023 ప్రకారం, దేశంలోని అటవీ విస్తీర్ణం 7,15342.61 చదరపు కిలోమీటర్లు కాగా.. ఇందులో పశ్చిమ కనుమలలోని పర్యావరణ సున్నిత ప్రాంతాలు కూడా ఉన్నాయని వివరించారు.
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ – 2013తో పోలిస్తే.. ISFR-2023 మధ్య గత పదేళ్లలో దేశంలో 16630.25 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగిందని వివరించారు. పశ్చిమ కనుమలలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో చాలా దట్టమైన అడవుల విభాగంలో 3465.12 చదరపు కిలోమీటర్ల పెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 రిపోర్టు ప్రకారం 2021తో పోలిస్తే విజయనగరం జిల్లాలో అత్యధికంగా 35.35 శాతం, నెల్లూరు జిల్లాలో 17.77శాతం, కోనసీమ జిల్లాలో 10.68 శాతం పెరుగుదల ఉందన్నారు.