*ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలు స్థితి ఏంటి? : ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి*

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PM-MSY) పథకం అమలు వివరాలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కోరారు. మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు పలు అంశాలపై ఆరా తీశారు. అంచనా పెట్టుబడి, చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్‌ సదుపాయాలు, మార్కెటింగ్ బలోపేతం చేయడం, మత్స్యకారుల సంక్షేమం వంటివాటిల్లో సమస్యలను అధిగమించడం, పథకం వ్యవధిపై వివరాలు కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY)ను 2020-21 నుంచి 2024-25 వరకు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అమలు చేస్తోందన్నారు. 2020-21 నుంచి ఇప్పటివరకు అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు రూ.20,990 కోట్ల విలువైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.8924 కోట్లన్నారు. ఇక PMMSY కింద రూ.559.10 కోట్ల కేంద్ర వాటాతో మొత్తం రూ.2398.72 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయని వివరించారు.

ఇక పథకం అమలులో పలు కీలక ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి వివరించారు. 58 ఫిషింగ్ హార్బర్‌లు/ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌లు, 634 ఐస్ ప్లాంట్లు/శీతల గిడ్డంగులు, 2 స్మార్ట్ హోల్‌సేల్ మార్కెట్‌లు, 202 రిటైల్ ఫిష్ మార్కెట్‌లు, 6694 ఫిష్ కియోస్క్‌లు, 27189 యూనిట్లు చేపల రవాణా సౌకర్యాలు, 128 వాల్యూ యాడ్ ఎంటర్‌ప్రైజ్‌ల కోసం ఎంటర్‌ప్రైజ్‌లు, ఇ-మార్కెటింగ్ సదుపాయం వంటివి కల్పించామన్నారు. వీటితో పాటు సుమారు 12,000 రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, 4,205 బయోఫ్లోక్ యూనిట్లు, 55,118 రిజర్వాయర్ కేజ్‌లు, 5,711 రేస్‌వేలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఇక PMMSY కింద ఆంధ్రప్రదేశ్‌లో 64 రీ-సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, 97 బయోఫ్లోక్ యూనిట్లు, 471 కేజ్‌లు, 4,715 కియోస్క్‌లు, రిటైల్ అవుట్‌లెట్లు, 9 ఫిషింగ్ హార్బర్‌లు & ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 16 ఐస్ ప్లాంట్లు & శీతల గిడ్డంగులు ఉన్నాయన్నారు.

PMMSY పథకం.. చేపల పెంపకం, ఆక్వాకల్చర్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిందన్నారు. ముఖ్యంగా 2019-20లో వార్షిక చేపల ఉత్పత్తి 141.64 లక్షల టన్నులు ఉండగా 2022-23 నాటికి 175.45 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. ఎగుమతుల విలువ రూ.46,662 కోట్ల నుంచి 2023-24 నాటికి రూ.60,524 కోట్లకు పెరిగిందన్నారు. ఇక తలసరి చేపల వినియోగం 5-6 కిలోల నుంచి 12-13 కిలోలకు పెరిగిందని పేర్కొన్నారు. ఆక్వాకల్చర్ ఉత్పాదకతను హెక్టారుకు 3 టన్నుల నుంచి నుండి 4.7 టన్నులకు చేరిందన్నారు.

చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 2019-20లో 41.74 లక్షల టన్నులు కాగా.. 2023-24 నాటికి 51.58 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు. PMMSY కాల వ్యవధి మార్చి 31, 2025తో ముగుస్తున్నందున, కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు, 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పథకాన్ని పొడిగించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed