*ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్రం సాయం ఏంటి? : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గిరిజన మహిళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏంటని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన లోక్‌సభలో ఈ విషయమై పలు ప్రశ్నలు వేశారు. జాతీయ గిరిజన ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ(NSTFDC) ద్వారా ఆదివాసీల ఆదాయం, స్వయం ఉపాధి కోసం అమలు చేస్తున్న పథకాల వివరాలు ఆరా తీశారు. ఆదివాసీ మహిళా సశక్తికరణ్ యోజన గిరిజన మహిళలకు ఏ మేరకు సహాయం చేస్తోందని, గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన మహిళలకు ఇచ్చిన రుణాల వివరాలు తెలియజేయాలన్నారు. వీరికి ఇస్తున్న రుణాన్ని రూ.10 లక్షలకు పెంచే ఆలోచన ఏదైనా ఉందా అని వివరాలు కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్‌ ఉయికే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(NSTFDC) వివిధ పథకాల కింద ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలు/స్వయం ఉపాధిని చేపట్టేందుకు అర్హులైన షెడ్యూల్డ్ తెగలకు రాయితీ రుణాలను అందిస్తుందన్నారు.

అందులో ముఖ్యంగా టర్మ్ లోన్ స్కీమ్ అనే పథకం కింద NSTFDC ప్రాజెక్టుకు రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందని, ఇందులో ప్రాజెక్ట్ వ్యయంలో 90% వరకు ఆర్థిక సహాయంగా అందించబడుతుందన్నారు. మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ/ప్రమోటర్ సహకారం ద్వారా సమకూర్చడబుతుందన్నారు.
ఆదివాసీ మహిళా సశక్తికరణ్ యోజన(AMSY) షెడ్యూల్డ్ తెగల మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేకమైన పథకం. ఈ పథకం కింద రూ. 2 లక్షల ప్రాజెక్ట్‌ వ్యయంలో 90% వరకు రుణంగా అందించబడుతుందన్నారు.
మైక్రో క్రెడిట్ పథకం (MCF) కింద స్వయం సహాయక సంఘాల ద్వారా ఎస్టీ సభ్యులకు రుణ సదుపాయం కల్పిస్తారన్నారు. ఇందులో ప్రతి సభ్యునికి 50000 వరకు, స్వయం సహాయక బృందానికి గరిష్టంగా 5 లక్షల వరకు రుణాలు అందజేస్తుందన్నారు.

ఆదివాసీ శిక్షార్రిన్ యోజన (ASRY) అనే పథకం ఎస్టీ విద్యార్థుల కోసం ఉద్దేశించబడిందన్నారు. దీని కింద సాంకేతిక, వృత్తిపరమైన విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థికి రూ. 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుందన్నారు.

ఆదివాసీ మహిళా సశక్తికరణ్ యోజన (AMSY) పథకం కింద, NSTFDC గత ఐదు సంవత్సరాలు, ప్రస్తుత సంవత్సరంలో (28.03.2025 వరకు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సమాధానం ఇచ్చారు. అయితే, స్త్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా SHG సభ్యుల కోసం మైక్రో క్రెడిట్ స్కీమ్ కింద మహిళలకు సహాయం చేయబడిందన్నారు. ఆదివాసీ మహిళా సశక్తికరణ్ యోజన (AMSY) కింద రుణ పరిమితిని పెంచడంపై ఎలాంటి ఆలోచన లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed