అల్లీపురం డంపింగ్ యార్డ్ వ్యర్ధాల నిర్వహణను పర్యవేక్షించిన మేయర్
స్థానిక అల్లీపురం డంపింగ్ యార్డును మేయర్ స్రవంతి జయవర్ధన్ శుక్రవారం సందర్శించి వ్యర్దాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అల్లీపురం డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కొంత మేరకు దెబ్బతిని కూలిపోయున్నందున, శిధిలమైన చోట అవసరమైన మేరకు గోడను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మేయర్ స్రవంతి జయవర్ధన్ అధికారులను ఆదేశించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి చెత్త సేకరణ వాహనాల ద్వారా ఇంటింటి నుంచి సేకరిస్తున్న వ్యర్దాలను అల్లీపురంలోని డంపింగ్ యార్డ్ కు ప్రతిరోజు తరలిస్తారని తెలిపారు.
నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్ల నుండి తడి – పొడి వ్యర్ధాలను విడివిడిగా సేకరించి ప్రతిరోజు దాదాపు 300 టన్నుల వ్యర్దాలను డంపింగ్ యార్డ్ కు తరలించి అక్కడినుంచి దొంతాలి యార్డుకు తరలిస్తారని వివరించారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పారిశుద్య పనుల నిర్వహణమీద ప్రత్యేక దృష్టి సారించి ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పారిశుద్య పనులకు నిధులు కేటాయించారని తెలిపారు.
నగరపాలక సంస్థ పరిధిలో క్రమం తప్పకుండా పారిశుధ్య పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని మేయర్ తెలియజేసారు.
వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కు తరలించే క్రమంలో వాహనాల పైన తప్పనిసరిగా వలలను కప్పి ఉంచి వ్యర్ధాలు రోడ్లపై పడకుండా తగిన జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సిబ్బందికి మేయర్ సూచించారు.
డంపింగ్ యార్డ్ ప్రవేశంలో వాహనాలు ప్రణాళికబద్ధంగా రవాణా అయ్యేలా జాగ్రత్తలు తీసుకొని, ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని మేయర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.