అన్న క్యాంటీన్లను ఆదర్శంగా నిర్వహించండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, కందుకూరు మున్సిపాలిటీల పరిధిలోని అన్న క్యాంటీన్లను ఆదర్శంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లకు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ సూచించారు.
మున్సిపల్ కమిషనర్లు, అన్న క్యాంటీన్ల స్పెషల్ అధికారులు, క్యాంటీన్ ల నిర్వాహకులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లను ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పాత మున్సిపల్ ఆఫీస్, తడికల బజార్ కూడలి, ఇందిరా భవన్ రోడ్డు, ఫిష్ మార్కెట్, వెంగళరావు నగర్, మద్రాసు బస్టాండ్, రామ లింగాపురం కూడలి ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజలకు మూడు పూటలా ఆహారాన్ని సరియైన సమయమునకు అందిస్తున్నామని తెలియజేశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 7 అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి నిర్వహణ తీరును ఇంకా మెరుగుపరిచి, ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
అన్న క్యాంటీన్లలో క్వాలిటీ, క్వాంటిటీలను మెరుగుపరిచి, ఆహారంలో రుచి శుచి ఉండేలా అధికారులు, సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
అన్నా క్యాంటీన్ ల నిర్వాహకులు ప్రతీ క్యాంటీన్ లో తప్పనిసరిగా 7 మంది సిబ్బంది ఉండేలా చూసుకోవాలని, ఒక వాచ్మెన్, ఒక టోకన్లు ఇచ్చే వ్యక్తి, ముగ్గురు సప్లయర్స్, క్లీనింగ్ చేయడానికి మరో ఇద్దరు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆహారం తయారీ ప్రాంతం నుంచి క్యాంటీన్ లకు సరఫరా చేసేందుకు, క్యాంటీన్లో ప్రజలకు వడ్డించేందుకు అవసరమైన మేరకు సిబ్బందిని పెంచుకోవడంతో పాటు తోపులాటలు జరగకుండా సెక్యూరిటీ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్ సూచించారు. సిబ్బంది హాజరు పట్టిక, విజిటర్స్ హాజరు పట్టిక, ఫిర్యాదుల పట్టికలను ప్రతి క్యాంటీన్లో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అన్ని క్యాంటీన్లలో సీ.సీ. కెమెరాలను ఏర్పాటు చేసియున్న కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా పర్యవేక్షించాలని స్పెషల్ ఆఫీసర్లును ఆదేశించారు.
ప్రతి క్యాంటీన్లో స్వచ్ఛమైన తాగునీరు కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ఎప్పటికప్పుడు ఆహారపు ప్లేట్లను వేడి నీటితో శుభ్రపరచడం, అందుకోసం వాటర్ హీటర్ ఏర్పాటు, ప్లేట్లు కడిగే ప్రాంతంలో ప్లాట్ఫారం ఏర్పాటు, రూఫ్ ఏర్పాటు, మురుగు నీరు పోవడానికి ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు.
ఆహరం అందించే వేళలను రద్దీ మేరకు పెంచడం, ఎక్కువ ఆహారం అవసరమైన క్యాంటీన్ కు ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడం వంటి అంశాలపై దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం, క్యాంటీన్ నిర్వహణపై ప్రజల నుంచి ప్రతి రోజూ అభిప్రాయాలు సేకరించడం, సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు చేరవేయడం, అభిప్రాయాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
క్యాంటీన్ల ప్రాంగణంలో పూల మొక్కలను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు.
పోలీసు విభాగం వారి సహకారంతో అవసరమైన క్యాంటీన్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏవైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు.
పాత మున్సిపల్ కార్యాలయంలోని నిరాశ్రయులు మూడు పూటల అన్న క్యాంటీన్ల కు వచ్చి ఆహారాన్ని స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో కూడా అర్బన్ హోమ్ లెస్ పీపుల్ సెంటర్లను ఏర్పాటు చేసి నిరాశ్రయులకు మూడు పూటల ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కమీషనర్ నందన్, స్పెషల్ అధికారులు చెన్నుడు, కావలి,ఆత్మకూరు,గూడూరు,నాయుడుపేట,సూళ్లూరుపేట,వెంకటగిరి, కమిషనర్లు , వేణు , రహంతూ జానీ, శేషగిరి రావు, క్యాంటీన్ ల నిర్వాహకులు గణేష్, అనిల్, సాయి, నిఖిల్ పాల్గొన్నారు.