అన్న క్యాంటీన్లకు ఏసీ సదుపాయం కల్పించండి
– కమిషనర్ సూర్యతేజ ఐ.ఏ.ఎస్.,
రానున్న వేసవికాలం ఎండ తీవ్రత దృష్ట్యా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏడు అన్న క్యాంటీన్లలో ఏసి సదుపాయం కల్పించి, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం 49వ డివిజన్లోని బిఈడి కాలేజ్, గవర్నమెంటు మోడల్ హైస్కూల్, దోర్నాల వీధి, ఈద్గా మిట్ట, గుండాల సుబ్బారెడ్డి తోట, జయలలిత నగర్ , పాత మున్సిపల్ ఆఫీసు రోడ్డు తదితర ప్రాంతాలలో పర్యటించారు.
పర్యటనలో భాగంగా పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అన్న క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్లలో చల్లటి, సురక్షిత తాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, టోకెన్ విధానం ద్వారా మాత్రమే ప్రజలకు ఆహారాన్ని అందించాలని క్యాంటీన్ నిర్వహకులకు కమిషనర్ సూచించారు.
డివిజన్ పరిధిలోని అన్ని డ్రైను కాలువలలో పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. కొన్ని ప్రాంతాలలో డ్రైను కాలువలకు లెవెలింగ్ పనులను చేపట్టి మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పర్యవేక్షించాలని, నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపించాలని సూచించారు.
డివిజన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటి నుంచి భూగర్భ డ్రైను కనెక్షన్ తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. రామ్మోహన్, డిప్యూటీ కమిషనర్ చేన్నుడు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. చైతన్య , వెటర్నరీ డాక్టర్. మదన్మోహన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రహంతు జానీ రెవిన్యూ ఆఫీసర్ ఇనాయాతుల్లా, ఏ.సి.పి. ప్రకాష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.