అన్ని డివిజన్లలో పూడిక తీత పనులను క్రమం తప్పకుండా చేపట్టండి
– కమిషనర్ వై.ఓ. నందన్
నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో మేజర్, మైనర్ డ్రైన్ కాలువలలో పూడికతీత పనులను సిల్ట్ ఎత్తివేత చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశించారు.
పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 9వ డివిజన్ బంగ్లా తోట పరిసర ప్రాంతాలలో కమిషనర్ మంగళవారం పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పి. నారాయణ సూచనల మేరకు డ్రైను కాలువల పూడికతీత పనులతో పాటు పూర్తిస్థాయిలో సిల్ట్ తొలగించేందుకు నగరం మొత్తం చిన్న కాలువలు, పెద్ద కాలువలు మొత్తం డీసిల్టేషన్ పనులను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు.
అవసరమైన డ్రైను కాలువల్లో గ్యాంగ్ వర్క్ చేపట్టి కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన ఆక్రమణలు, పిచ్చి మొక్కలు, ర్యాంపులు, మెట్లను తొలగించి వంద శాతం సిల్ట్ తొలగింపు పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
గత కొన్నేళ్ల నుంచి పేరుకుపోయిన సిల్ట్ ను మిషన్ల సహాయంతో తొలగించడంతో దోమల ఎదుగుదలకు అవకాశం లేకుండా పోయిందని, వాటి పూర్తి నిర్మూలనకు పూడికతీత పనులు ఉపయుక్తమవుతాయని కమిషనర్ తెలిపారు.
డివిజన్ పరిధిలోని నూతన భవన నిర్మాణాలను కమిషనర్ పరిశీలించి వాటికి సంబంధించిన కొలతలు వేసి, అనుమతులు, అసెస్మెంట్, ఇంటి పన్నులు తదితర పత్రాలను పరిశీలించారు. భవన నిర్మాణ కొలతలకు, ఇంటి పన్నుకు వ్యత్యాసం ఉండటంతో సంబంధిత రెవెన్యూ అధికారి, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులకు షో కాజు నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు.
24 గంటల్లో గార్బేజిల నుంచి చెత్తను సేకరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని, ఇంటింటి చెత్త సేకరణలో తప్పనిసరిగా తడి, పొడి చెత్తను విడిగా సేకరించేలా పారిశుద్ధ సిబ్బందిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.
అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా డ్రైన్ కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత పనులతో పాటు ఇంటింటి చెత్త సేకరణలో తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా సిబ్బందిని పర్యవేక్షించాలని శానిటేషన్ విభాగాన్ని కమిషనర్ ఆదేశించారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకునే విషయంలో నగర ప్రజలకు అవగాహన కల్పించి కనెక్షన్లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డ్ సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.