*అనుమతులు ప్రకారం లేని నిర్మాణాలను పిల్లర్ల దశలోనే తొలగించండి : కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,*

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు ప్రకారం లేకుండా నిర్మిస్తున్న భవనాలను పిల్లర్ల స్థాయి దశలోనే గుర్తించి నిర్మాణాలను తొలగించాలని కమిషనర్ సూర్య తేజ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులకు సూచించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వారాంతపు సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించి ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ సమయంలో తప్పనిసరిగా అనుమతులు, ప్లాన్ నమూనాలు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని, అలా ప్రదర్శించని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

నిర్మాణం పిల్లర్ల దశ దాటి పూర్తిస్థాయికి చేరుకున్న తర్వాత నిర్మాణాన్ని అనుమతులు లేని కారణంగా తొలగించాల్సి వస్తే యజమానులకు భారీ నష్టం చేకూరుతుందని ముందుగానే హెచ్చరించాలని కమిషనర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి పి.ఓ. సీ.ఓ, నోటీసులు జారీ చేసి ఛార్జ్ షీట్ ఓపెన్ చేయించాలని సూచించారు.

ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్లు తీసుకోకుండా భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. అనుమతులు లేని ఫ్లెక్సీలను గుంజలతో సహా తొలగించేయాలని, అనధికార ప్రకటనల,పోస్టర్లను ఇతర ప్రచారాలను తొలగించే చర్యలను ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు.

భవన నిర్మాణాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ నిర్మాణ సామాగ్రితో వీధులు ఆక్రమణలకు గురవకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేలా నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకటనలను పన్నులను అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి తప్పనిసరిగా వసూలు చేసి జమ చేయించాలని కమిషనర్ సూచించారు.

అనధికార లేఔట్లను గుర్తించి వాటి యజమానులకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డ్ సచివాలయ కార్యదర్శులతోపాటు ప్లానింగ్ విభాగాలోని అధికారులంతా ఏ ఒక్క ఫైలు తమ లాగిన్లలో పెండింగ్ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు అందరూ సమీక్షించుకొని ప్రణాళిక బద్ధంగా తమకు కేటాయించిన విధులను నిర్వహించాలని కమిషనర్ సూచించారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 45/2 సచివాలయం వార్డు ప్లానింగ్ కార్యదర్శి పార్థసారథి కు షోకాజ్ నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో సిటీ ప్లానర్ హిమబిందు, డీ.సీ.పీ. పద్మజ, ఏ.సీ.పి. వేణు, టిపిబిఓ లు వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed