సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలి.
.. జిల్లా కలెక్టర్ ఆనంద్
జిల్లాలోని వ్యవసాయ , పాడి , మత్స్య సహకార సంఘాలను పటిష్టపరిచి సభ్యులకు మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కోరారు.
గురువారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సహకార రంగం ద్వారా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్లో సూచించిన విధంగా ‘సహకారం ద్వారా సమృద్ధి’ స్ఫూర్తిగా సహకార సంఘాలను బలోపేతం చేయాలన్నారు. కంప్యూటరీకరించిన వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మాన్యవల్ విధానం లో లావాదేవీలు నిర్వహించరాదని కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా పిఎసిఎస్ సంఘాలు కవర్ చేయని గ్రామపంచాయతీల్లో నూతనంగా బహుళ ప్రయోజన పిఎసిఎస్ సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అర్హత కలిగిన అన్ని పిఏసిఎస్ లలో పెట్రోల్ బంకులు ఎల్పిజి గ్యాస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలన్నారు. సహకార సంస్థలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎలా సహాయపడతాయో తెలియజేసే విధంగా రూపొందించిన అంతర్జాతీయ సహకార సంవత్సరము 2025 కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలసి ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో డిసిసి బ్యాంకు సీఈవో శ్రీనివాసరావు, నాబార్డ్ డీడీఎం డాక్టర్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగేశ్వరరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.