_*వీఎస్‌యూలో “తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తి” జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది*_
………………..
నెల్లూరు: విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) తెలుగు శాఖ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలుగు భాషా పరిరక్షణ, పరిశోధన, పరివ్యాప్తి” జాతీయ సదస్సు గురువారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా ముగిసింది.

సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
“తెలుగు భాష మన సంస్కృతికి, మనసుకు ప్రతిబింబం. భాష పరిరక్షణ అంటే కేవలం అక్షరాల పరిరక్షణ కాదు; ఆ భాషలోని ఆత్మను, భావాన్ని, సంస్కృతిని కాపాడటం కూడా మన బాధ్యత” అని తెలిపారు. ఆయన విద్యార్థులు, పరిశోధకులు భాషా అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమాపన సందేశం అందించిన డాక్టర్ జి.వి. పూర్ణచందు, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ —
“తెలుగు భాష విశాల సముద్రం వంటిది. దానిలోని విలువైన ముత్యాలను కనుగొని కొత్త తరాలకు అందించడం మనందరి బాధ్యత. భాష పరిశోధన అంటే పాత పాఠ్యాల సేకరణ మాత్రమే కాదు, వాటిని ఆధునిక సందర్భంలో పునర్మూల్యాంకనం చేయడమూ కావాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని పత్రాలు సమర్పించారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ సదస్సులో భాషా పరిణామం, సాహిత్య వైవిధ్యం, భాషా సాంకేతికత, ప్రజా సంస్కృతి, భాషా బోధనలో సవాళ్లు వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
ఈ సదస్సు కు సంచాలకులుగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, తెలుగు విభాగాధిపతి డాక్టర్ మైల త్యాగరాజు, కన్వీనర్‌గా డాక్టర్ రాజారామ్, సదస్సు కో – కన్వీనర్‌ డాక్టర్ తెలిదేవులపల్లి విమల, డాక్టర్ వి. వెంకటేశ్వర్లు మరియు వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *