
*ప్రతి రైతునూ ఆదుకుంటాం*
*నష్టపోయిన ప్రతి పంటకి నష్టపరిహారం అందిస్తాం*
*వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకుంటాం…రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*
*నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన మంత్రి ఆనం*
*రెండు రోజుల్లో ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం*
నెల్లూరు , మార్చి 23: నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతి పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కలసి ఇటీవలి పంట నష్టాలపై సమీక్ష నిర్వహించారు. అంతకుముందు అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి, కామిరెడ్డిపాడు, మంగుపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, పత్తి, మిరప తదితర పంట పొలాలను మంత్రి స్వయంగా పరిశీలించి వచ్చారు.
అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం కారణంగా అనంతసాగరం, మర్రిపాడు, కలువాయి, రాపూరు, సీతారాంపురం, మండలాల్లోని 21 గ్రామాల్లో 1469 మంది రైతులు సుమారు 1289 హెక్టార్లలో పంటలను నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తక్షణమే కచ్చితమైన ఎన్యుమరేషన్ పూర్తి చేసి నివేదికను కలెక్టర్కు అందించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి, నిబంధనల మేరకు సకాలంలో నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లుగాను, గోతాలు, రవాణా తదితర సమస్యలను అధిగమించి రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
రైతులు ఎవరు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి ఇతర అధికారులు పాల్గొన్నారు