
*నెల్లూరులో ఘనంగా P4 వార్షికోత్సవం..ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ*
* పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే P4 ఉద్దేశం: మంత్రి నారాయణ
* 2047 లక్ష్యం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా బంగారు కుటుంబం
* 150 కోట్లతో 16 కార్పొరేషన్ స్కూళ్ల ఆధునీకరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్గదర్శి – బంగారు కుటుంబం (P4) వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ లో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన P4 ద్వారా పేదల ఆర్థిక స్థితిగతులను మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. వెల్త్, హెల్త్, హ్యాపినెస్ అనే పది సూత్రాలతో ముందుకు సాగుతూ, సమాజంలోని సంపన్నులు పేదరికంలో ఉన్న 20 శాతం మందికి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
నెల్లూరు సిటీలో ఇప్పటికే 9,959 బంగారు కుటుంబాలను గుర్తించామని, వారికి చేయూతనిచ్చేందుకు 503 మంది మార్గదర్శకులు ముందుకు రావడం శుభపరిణామమని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా మార్గదర్శకులుగా నిలిచిన నవజీవన్ సంస్థ, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, షేక్ బాషాలను మంత్రి ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. తన సొంత పిల్లలు కూడా 8 వేల సైకిళ్లను ఉచితంగా అందించి మార్గదర్శులుగా నిలిచారని, సుమారు వెయ్యి మందికి ఉచిత కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుమారు 150 కోట్ల సీఎస్ఆర్ (CSR) నిధులతో మరో 16 స్కూళ్లను ఆధునీకరిస్తున్నామని, అదానీ కంపెనీ సహకారంతో కేవలం 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాతా అశోక్, కమిషనర్ వై.ఓ నందన్, డిప్యూటీ మేయర్లు తహసీన్ ఇంతియాజ్, రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి పొట్లూరి రామకృష్ణ, కార్పొరేషన్ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అదనపు కమిషనర్ హిమబిందు,డిప్యూటీ డైరెక్టర్ మాధురి,cvap పరిపూర్ణ ప్రసాద్,ప్రజా ప్రతినిధులు, బంగారు కుటుంబాలు పాల్గొన్నాయి .
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.