
*నగర పాలక సంస్థ అధికారుల సేవలు ప్రశంసనీయం*
*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా*
నెల్లూరు, అక్టోబర్ 22 :
గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు నెల్లూరు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ నగర పాలక సంస్థ అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగర ప్రజలకు సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు.
చిన్న వర్షానికే ఇబ్బందులు పడే నగర ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ, నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ నందన్ ఆధ్వర్యంలో అధికారులు పగలు, రాత్రి లేకుండా కష్టపడి పని చేశారు. పది డివిజన్లలో సిబ్బంది ని 3 షిప్ట్ లుగా విభజించి మురుగునీరు, పారిశుద్యం పై ప్రత్యేక శ్రద్ద పెట్టి చర్యలు చేపట్టారు.
వర్షపు నీరు నిలిచే ప్రాంతాలైన అభిరామ్ హోటల్ సెంటర్, వి ఆర్ సి సెంటర్, లీలామహల్ సెంటర్, లక్కీ షాపింగ్ మాల్ సెంటర్, సండే మార్కెట్ తదితర ప్రాంతాల్లో మురుగునీటి కాలువల శాశ్వత నిర్మాణాలను తాత్కాలికంగా తొలగించి డ్రైనేజి సిస్టం ను సరిచేశారు. దాంతో పడిన నీరు పడినట్లుగా కాలువలు ద్వారా వెళ్లాయి.
అదేవిధంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, విజయమహల్ గేట్, రామలింగాపురం, మాగుంట లే అవుట్ ప్రాంతాల్లోని అండర్ పాస్ ల వద్ద బయటి ప్రాంతాల నీరు చేరకుండా డైవర్షన్ చర్యలు తీసుకున్నారు. దాంతో నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆటంకం లేకుండా తమ డైనిందిత కార్యకలాపాలు సాగించారు.
అదేవిధంగా నగరం లోని ప్రధాన కాలువల్లో సిల్ట్ తీసివేయడంతో వర్షపు నీరు సాఫీగా సాగింది. గతంలో చిన్నపాటి వర్షానికి ఇబ్బందులు పడే ప్రజలు ప్రస్తుత భారీ వర్షాలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ నందన్ సేవలను స్ఫూర్తి గా తీసుకుని అధికారులందరూ విపత్తు సమయంలో చొరవ తో పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.