
*దోమల నివారణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు — మేయర్ రూప్ కుమార్ యాదవ్*
నగరవ వ్యాప్తంగా తీవ్ర సమస్యగా ఉన్న దోమల నివారణకు డివిజన్ల వారీగా ప్రణాళికబద్ధంగా చర్యలను చేపట్టి పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు కృషి చేస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్ విభాగం వారాంతపు సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
సమావేశంలో మేయర్, కమిషనర్ వై.ఓ నందన్ లు పాల్గొని వివిధ అంశాలపై శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు ఆరోగ్యకర జీవనానికి అవసరమైన ఏర్పాట్లు అందించడం ప్రధాన బాధ్యత అని తెలిపారు.
మంత్రివర్యులు డాక్టర్ పి. నారాయణ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల ఆలోచనల మేరకు దోమల నివారణకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతంగా అన్ని డివిజన్లలో అమలు చేస్తూ, దోమల వ్యాప్తిని నియంత్రించేందుకు శానిటేషన్ విభాగం శాయశక్తులా కృషి చేస్తుందని తెలిపారు.
దోమల మందు పిచికారీని డ్రైను కాలువలతో పాటు చెట్లు, పొదలలో పిచికారి చేయడంతో పాటు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టడం, కాలువలలో ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా దోమలను నియంత్రించేందుకు అవకాశం ఉందని మేయర్ తెలియజేశారు.
కమిషనర్ వై.ఓ నందన్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయడం, మలమూత్ర విసర్జన చేయడం, నిషేధించిన సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడటం, భవన నిర్మాణాల వ్యర్థాలను రోడ్లపై వేయడం తదితర వాటిపై కఠినంగా వ్యవహరించి అపరాధ రుసుములు విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాటికి సంబంధించిన అపరాధ రుసుములను చెల్లించేందుకు నూతనంగా రూపొందించిన “స్వచ్ఛ నెల్లూరు” యాప్ ద్వారా మాత్రమే నిర్వహించాలని శానిటేషన్ విభాగానికి సూచించారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ వెటర్నరీ వైద్యులు మదన్మోహన్, మలేరియా విభాగం అధికారి డాక్టర్ జిజియా, టి.పి.ఆర్.ఓ వాసు బాబు, శానిటేషన్ విభాగం అధికారులు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ
నెల్లూరు నగరపాలక సంస్థ