నెల్లూరు, జనవరి 16 :

*దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలు :  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

 

దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాభివృద్ధి, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో నూతన సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించి రాష్ట్రంలో సంస్కరణలను చేపట్టామన్నారు. దాదాపు 18 అంశాలలో మార్పులు చేసి ప్రజలకు అనుకూలంగా సులభతరం చేశామన్నారు. ఇంటి నిర్మాణదారులు, అలాగే లేఅవుట్ నిర్వాహకులు అత్యంత సులువుగా మున్సిపల్ అనుమతులు పొందేలా తయారుచేసామన్నారు. దాంతో రియల్టర్లు, బిల్డర్లు, అపార్ట్మెంట్ నిర్మాణదారులు హర్షం వ్యక్తం చేశారన్నారు. అదేవిధంగా నెల్లూరు నగర పాలక సంస్థలో వివిధ రకాల అనుమతుల కోసం పెండింగ్ లో ఉన్న 11 మంది దరఖాస్తుదారులను సమావేశానికి పిలిపించి పరిష్కరించే ప్రయత్నం చేశారు. వాటిలో ఏడు దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు జారీ చేశారు. కొన్ని అంశాలకు సంబంధించి విజయవాడలోని పురపాలక శాఖ సెక్రటరీ, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ల తో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి అనుమానాలను నివృత్తి చేయించారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలను అమలు చేసే దశలో నెల్లూరు నగరపాలక సంస్థ ముందుండాలని ఈ సందర్భంగా అధికార్లకు సూచించారు. అనధికార లేఅవుట్లలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరి మీద ఎటువంటి కక్ష సాధించాలని ఉద్దేశం తమకు లేదన్నారు. లేఔట్ యజమానులు, వ్యాపారులు అన్ని అనుమతులు తీసుకుంటే, పన్నులు జీఎస్టీ తదితరాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు.

ఈ సమావేశంలో ఆర్డిఓ అనూష , టౌన్ ప్లానింగ్ అధికారి హిమబిందు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *