*తమిళనాడు మత్స్యకారుల అక్రమ వేటకు శాశ్వత అడ్డుకట్టే లక్ష్యం*

*మత్స్యకారుల భాగస్వామ్యంతో పటిష్ట వ్యవస్థకు ప్రభుత్వం కసరత్తు*

*జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల*

*జూన్ 15లోగా 4 హైస్పీడ్ బోట్ల కొనుగోలు – ప్రత్యేక బృందాలతో 5G గస్తీ ముమ్మరం*

*దక్షిణ కోస్తా జిల్లాల మత్స్యకార గ్రామ కాపులతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. ఆజితా వేజెండ్ల ముఖాముఖి*

*మత్స్యకారుల సంక్షేమానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా*

నెల్లూరు, ఏప్రిల్ 9 : తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ వేట సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు. మత్స్యకారుల అభిప్రాయాల మేరకు పటిష్టమైన వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపడుతోందన్నారు.

గురువారం నెల్లూరు టౌన్‌హాల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన 162 గ్రామాల మత్స్యకార కాపులు, మత్స్యకారులతో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజితా వేజండ్ల ముఖాముఖీ సమావేశం నిర్వహించారు.

తొలుత మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ డా. శాంతి అజెండాలోని అంశాలను వివరించగా, ప్రధానంగా పీఎంఎంఎస్‌వై పథకం కింద రూ.1.20 కోట్లతో నాలుగు హైస్పీడ్ బోట్ల కొనుగోలు, లబ్ధిదారుల ఎంపిక, బోట్ల రకం ఎంపిక, నిర్వహణ మరియు మరమ్మతులపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా నాలుగు జిల్లాల నుంచి విచ్చేసిన మత్స్యకార గ్రామాల కాపులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ 650 హెచ్‌పి సామర్థ్యం గల స్టీల్ బోట్లనే కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణను ప్రభుత్వమే భరించాలని సూచించారు. మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలోని బోట్లకు రిపేర్లు చేయాలని, గస్తీ బోట్లలో పనిచేసే మత్స్యకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. తీర గస్తీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని, సబ్సిడీ పెంచితే తామే బోట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమిళనాడు జాలర్ల అక్రమ వేట, దాడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

*అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ* తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల మత్స్యకారుల అక్రమ ప్రవేశాన్ని పూర్తిగా అడ్డుకునేందుకు పటిష్ట వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందన్నారు. ఈ క్రమంలో దక్షిణ కోస్తా నాలుగు జిల్లాల తీరప్రాంతంలోని 23 మండలాల మత్స్యకారులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. తమిళనాడు బోట్లను ఎలా అడ్డుకోవాలి, పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఎంతకాలం ఉంచాలి వంటి అంశాలపై చర్చించామని వివరించారు.
నాలుగు జిల్లాలకు నాలుగు హైస్పీడ్ బోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తిరుపతి జిల్లాకు ఒకటి, నెల్లూరు జిల్లాకు రెండు, బాపట్ల జిల్లాకు ఒక బోటును మంజూరు చేయగా, ప్రకాశం జిల్లాకు కూడా బోటు మంజూరు చేసేలా ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. ఈ బోట్లు 650 హెచ్‌పి సామర్థ్యంతో స్టీల్ బోట్లు కొనుగోలు చేయాలని మత్స్యకారులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బోట్లు కేవలం తీర గస్తీ కోసం మాత్రమే వినియోగిస్తామని, చేపల వేటకు ఉపయోగించబోమని మత్స్యకారులు స్పష్టం చేసినట్లు చెప్పారు. బోట్ల నిర్వహణ ఖర్చుపై అంచనా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
తీర గస్తీ బలోపేతానికి పోలీసు, మెరైన్, మత్స్య, అటవీశాఖల సమన్వయంతో పాటు స్థానిక మత్స్యకారుల భాగస్వామ్యాన్ని కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. బోట్లను సంరక్షించుకోవడానికి బోట్ల కొనుగోలులో భాగస్వామ్యం చేసేందుకు పదిమంది మత్స్యకారుల పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలోని బోట్లలో మన జిల్లాకు చెందిన మూడు బోట్లను రిపేర్లు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూన్ 15లోగా కొత్త బోట్లు సిద్ధం చేసి పటిష్ట గస్తీ వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈనెల 12వ తేదీ ఆదివారం లోపు మత్స్యకారులంతా బోట్ల కొనుగోలుకు సంబంధించి పదిమంది లబ్ధిదారుల పేర్లను, వాట్సాప్ గ్రూప్ తయారు చేసేందుకు ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క మత్స్యకారుని పేరును తీర్మానించుకుని తమకు జాబితా అందించాలని కలెక్టర్ సూచించారు.

*మత్స్యకారుల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు*

మత్స్యకారులతో నేరుగా సంబంధాల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తీరప్రాంతంలోని 23 మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున 23 మంది సభ్యులతో ఈ గ్రూపు ఏర్పాటుచేసి, తాను, ఎస్పీ సభ్యులుగా ఉంటామని చెప్పారు. మత్స్యకారులు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సమస్యలపై తమను ఎప్పుడూ సంప్రదించాలన్నా మత్స్యకారులు ఈ గ్రూపును వినియోగించుకోవచ్చని, లేదా నేరుగా తనను కలవచ్చని తెలిపారు. మత్స్యకారులకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఈ నిర్ణయం తీసుకున్నా ఈ గ్రూపులో తెలియజేస్తామని, గ్రూపులోని సభ్యులందరూ మిగిలిన వారికి తెలియజేయాలని సూచించారు.

*నమ్మకం ఉంచండి… మీకు తోడుగా ఉంటా*
*➖ మత్స్యకారుల్లో ఉత్సాహం నింపిన కలెక్టర్*

మత్స్యకారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, తాను కలెక్టర్‌ కాకముందు ఆరేళ్లపాటు 70 దేశాల్లో సముద్రంలో పనిచేసిన అనుభవంతో మత్స్యకారుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే తన లక్ష్యమని తెలిపారు. తాను ఉన్నా లేకపోయినా సమస్య లేకుండా ఉండే విధంగా పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. భవిష్యత్తులో తీరప్రాంతాల్లో ఏర్పడే పరిశ్రమల ద్వారా మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వారి విద్యకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచాలని.. ప్రభుత్వం పక్షాన అన్ని విధాల తోడుగా ఉంటానని కలెక్టర్ ఈ సందర్భంగా మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.

*ఎస్పీ డా. అజితా వేజండ్ల మాట్లాడుతూ* తమిళనాడు బోట్ల అక్రమ వేటకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై ఒక ప్రత్యేక కమిటీని నియమించుకునేందుకు మత్స్యకారులు ముందుకు రావాలని ఎస్పీ డా.అజితా వేజండ్ల సూచించారు. తమిళనాడు బోట్లను పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఎన్నిరోజులు ఉంచుకోవాలి, ఎన్ని కిలోమీటర్లు గస్తీ తిరగాలి వంటి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు, మత్స్యకారులతో ఒక కమిటీ ఏర్పడితే విధివిధానాలు తయారుచేసుకోవచ్చని ఎస్పీ అన్నారు.

ఈ సమావేశంలో ఎఎస్‌పి సౌజన్య, డిఎఫ్‌వో మహబూబ్ బాషా, డిఆర్‌వో విజయ్‌కుమార్, డా. శాంతి, నెల్లూరు, కావలి ఆర్డీవోలు అనూష, ఎలీషా, మత్స్యశాఖ అధికారులు చాంద్ బాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed