టిడ్కో గృహాలను అర్హులైన నూతన లబ్ధిదారులకు మంజూరు చేయండి

– కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి లే అవుట్లలోని టిడ్కో గృహాలకు సంబంధించి మరణించిన, తిరస్కరించిన, రుణాలకు అర్హత పొందని లబ్ధిదారుల గృహాలను రద్దు చేసి అర్హులైన నూతన లబ్ధిదారులకు కేటాయించాలని కమిషనర్ వై.ఓ నందన్ అధికారులకు సూచించారు.

టిడ్కో గృహాల రద్దు, కేటాయింపులపై టిడ్కో విభాగం అధికారులు, మెప్మా విభాగంతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు.

సమావేశంలో పాల్గొన్న కమిషనర్ నందన్ మాట్లాడుతూ మరణించిన లబ్ధిదారుల వారసులకు, రుణ అర్హత పొందని వారి కుటుంబ సభ్యులకు తొలి ప్రాధాన్యంగా గృహాలను కేటాయించాలని సూచించారు.

బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు కుటుంబ సభ్యుల్లో మంచి సిబిల్ స్కోర్ ఉన్న వారిని అర్హులుగా గుర్తించి జాయింట్ పార్టనర్ గా నమోదు చేయాలని సూచించారు. 365 sft, 430 sft ఇండ్ల ప్లాట్ల లోన్ల మంజూరుకు మెప్మా విభాగానికి పలు సూచనలు జారీ చేశారు. జూన్ నెల 12వ తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న లోన్లు అన్నిటిని క్లియర్ చేసి, లబ్ధిదారులకు గృహాలను అందజేయాలని ఆదేశించారు.

బ్యాంకు లోన్ కు అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరును బ్యాంకర్లు సులభతరం చేయాలని సూచించారు. రుణాల మంజూరులో తలెత్తే వివిధ సందేహాలను నివృత్తి చేసి లోన్ అందేందుకు మెప్మా విభాగం పూర్తిగా సహకరించాలని సూచించారు. లోన్ ప్రక్రియ పూర్తయే వరకు లబ్ధిదారులను, బ్యాంకర్లతో అనుసంధానించి రుణాలు మంజూరు అయ్యేలా పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో టిడ్కో డి.సి.ఓ రామ సుబ్బారావు, నగరపాలక సంస్థ హౌసింగ్ విబాగ సిబ్బంది, మెప్మా విభాగం సి.ఎమ్.ఎమ్, సి.ఓ లు, సిబ్బంది పాల్గొన్నారు.

కమిషనర్ పేషీ
నెల్లూరు నగర పాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *