
*”చంద్రబాబు అక్రమ వసూళ్లకు రెగ్యులేటరీ కమీషన్ కళ్లెం” – కాకాణి*
28.09.2025
నెల్లూరు
– ఈఆర్‌సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు
: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం
నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
– ఏపీఈఆర్‌సీ అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల రూపంలో దోపిడీ
– విద్యుత్ బిల్లుల పేరుతో దోచుకున్న ప్రజల సొమ్మునే తిరిగిస్తున్నారు
– ప్రజలకు చంద్రబాబు మేలు చేసినట్టు ఎల్లో మీడియాలో కలరింగ్
– విద్యుత్ చార్జీలు పెంచనని ఎన్నికల్లో చెప్పి, ఏడాదిలో రూ. 19 వేల కోట్లు పెంచేశాడు
– పైగా అనుమతికి మించి ప్రజలపై భారం మోపి ఏపీఈఆర్‌సీతో తిట్లు తిన్నాడు
– చంద్రబాబు మోసాలను వివరించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు:
తన అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపినందుకు ప్రభుత్వానికి ఏపీఈఆర్‌సీ తలంటితే సిగ్గుపడాల్సిందిపోయి.. ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూడౌన్ వల్ల వినియోగదారులకు వెనక్కివ్వాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎందో ఉదారంగా తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిందే కాకుండా, సీఎం అయిన ఏడాదిలోనే ప్రజలపై చంద్రబాబు రూ.19 వేల కోట్ల విద్యుత్ భారం మోపాడని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వానికి ఏపీఈఆర్‌సీ మొట్టికాయలు
కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) డిస్కంలను ఆదేశించింది. తమ అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల రూపంలో ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేయడంతో ఏపీ ఈఆర్‌సీ మొట్టికాయలు వేసింది. దీంతో ప్రభుత్వం వెనక్కి ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ అక్రమంగా దోచుకున్న డబ్బును వెనక్కి ఇవ్వడం కూడా ప్రజలకు మేలు చేస్తున్నట్టు ఎల్లో మీడియాలో కలరింగ్ ఇచ్చుకోవడం సిగ్గుపడాల్సిన అంశం. ట్రూ అప్ చార్జీలపై విచారణ జరిపిన విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంలు చెప్పిన లెక్కలు, కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసం గుర్తించి క్రమంగా వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచనని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే విద్యుత్ రూ.19వేల కోట్లు చార్జీలు పెంచడమే కాకుండా ఏపీ ఈఆర్‌సీ అనుమతి కూడా తీసుకోలేదు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి మాట తప్పిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. దోచుకున్న సొమ్మును తిరిగివ్వాలని విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశిస్తే దానికి ఎల్లో మీడియా రంగులద్ది చంద్రబాబుని జాకీలతో పైకి లేపుతోంది. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ విద్యుత్ చార్జీలు పెంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేయడం తప్ప, చార్జీలు తగ్గించి ట్రూ డౌన్ చేయడం లేదని, నేడు చంద్రబాబు హయాంలో ట్రూ డౌన్ చేస్తున్నట్టు గొప్ప ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. వైయస్సార్సీపీ హయాంలో ఏనాడూ ఏపీ ఈఆర్‌సీ నిబంధనలను అతిక్రమించి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపనేలేదు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా లాక్కోవాలని ఆలోచించలేదు కాబట్టే చంద్రబాబులా మొట్టికాయలు తినలేదు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి కూడా చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తున్నాడని నమ్మించాలనుకోవడం దారుణం.
రూ.2,758.76 కోట్లు ప్రతిపాదిస్తే రూ.1,863.64 కోట్లకే అనుమతి
2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలను డిస్కంలు ఈ ఏడాది జూలైలో ప్రతిపాదించాయి. ఇందుకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి కోరగా వీటిపై విచారణ జరిపిన ఏపీ ఈఆర్‌సీ డిస్కంలు చెప్పిన లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. డిస్కంలు అడిగిన దానికి యథాతథంగా ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లు తగ్గించి.. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. అలాగే గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీ ఈఆర్‌సీ అనుమతించిన దానికి మించిన ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది. ఏపీ ఈఆర్‌సీ యూనిట్‌కు రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ యూనిట్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 వెచ్చించి విద్యుత్ కొన్నట్టు ప్రతిపాదనలో తెలిపాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే.. రూ.45,476 కోట్లు వెచ్చించామని డిస్కంలు చెప్పాయి. ఇందులో రూ.44,624 కోట్లకు ఏపీ ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. కాగా.. ప్రసార, పంపిణీ (ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్) నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్‌సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించింది.
యూనిట్ పై 40 పైసలు అదనంగా వసూలు
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నెలా యూనిట్‌కు రూ.0.40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూలు చేశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్ రూ.1,106.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.614.86 కోట్లు, ఈపీడీసీఎల్ రూ.1,065.76 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేసేశాయి. ఈ మొత్తం నుంచి అనుమతించిన రూ.1,863.64 కోట్లు పోగా.. మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నెల బిల్లు నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. అంటే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికంటే అదనంగా వసూలు చేశారని, దానిని 12 సమాన వాయిదాల్లో ప్రతి నెలా విద్యుత్ బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.13 పైసల చొప్పున సర్దుబాటు చేయాలని అదేశించింది. ఈఆర్‌సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు. 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా.. ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున అదనంగా వసూలు చేయడం ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకూ జనం డబ్బును అదనపు చార్జీల పేరుతో దోచేశారు.